1948 ఫిబ్రవరి 27న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులతో సర్దార్ పటేల్ అన్న మాటలు ఇవి..‘ఈ విశ్వవిద్యాలయం చేసినట్లుగా మనమందరం మన హృదయాలలో వివిధ సంస్కృతుల పట్ల సానుభూతిని కలిగి ఉండి ఉంటే భారతదేశంలో పరిస్థితులు వేరుగా ఉండేవి’. వాస్తవానికి భారత యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అనేది ఒక దేశంగా భారతదేశ ఆవిర్భావంలో ఒక గొప్ప చారిత్రక ఘట్టం. ఇది ఇటీవల ఒక రాజకీయ అంశంగా మారింది.
ఎన్నికల ప్రక్రియలో దీని విలీన చరిత్రను మనం గమనిస్తే.. 1947– 1949 మధ్య కాలంలో అనేక విడి ప్రాంతాలుగా ఉన్న భారతదేశం, ఒక ఉమ్మడి రాజ్యాంగంతో 'భారత యూనియన్' అనే దేశంగా రూపాంతరం చెందింది. 1947 జూన్‌లో బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర్య బిల్లును ఆమోదించడంతో హైదరాబాద్ పాలకవర్గం (నిజాం) తమ స్వయంప్రతిపత్తిని కోల్పోయింది. స్వాతంత్ర్య చట్టంలోని 6వ నిబంధన ప్రకారం భారతదేశం, పాకిస్థాన్ అనే రెండు సార్వభౌమ దేశాల ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. కాబట్టి, ఈ చట్టం ప్రకారం హైదరాబాద్ భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో భాగంగా మారాలి. ఆ తర్వాత 1947 ఆగస్టు – 1948 సెప్టెంబర్ మధ్య కాలంలో నిజాం అధికారాన్ని తొలగించి, సార్వభౌమ భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియ జరిగింది.
సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు జరిగిన సైనిక చర్య అనేది రాజులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌ల వంటి వివిధ ప్రాంతీయ శక్తులను రాజ్యాంగ పరిధిలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన ఒక రాజకీయ వ్యూహం. భారత ప్రభుత్వం పేర్కొన్నట్లుగా గణతంత్ర దేశంలో దాని అధికారిక ‘విలీనం’ అనేది ‘పోలీస్ చర్య’తో ప్రారంభమై, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించటానికి ముందే పూర్తయింది. రాజ్యాంగబద్ధమైన పదవి అయిన 'రాజప్రముఖ్'గా మారడం ద్వారా నిజాం తన పూర్వపు పాలక హోదాను కోల్పోయి రాజ్యాంగ పరిధిలోకి వచ్చారు. భారతదేశాన్ని ఒక సమగ్ర ప్రాదేశిక దేశంగా తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో భారత జాతీయవాద నాయకత్వం ఒక స్పష్టమైన విలీన విధానాన్ని రూపొందించింది.
బ్రిటిష్‌వారి ఆశ్రితుడిగా నిజాం
భారత సింహాసనాన్ని ఖాళీగా ప్రకటించడానికి బ్రిటిష్ వారు చివరి మొఘల్ చక్రవర్తిని బహిష్కరించారు. ఈక్రమంలో మొఘల్ సింహాసనానికి వారసులుగా తమను తాము స్థాపించుకోవాలని చూస్తున్న శక్తిమంతమైన మరాఠాలు, మైసూరులకు వ్యతిరేకంగా మొఘల్ వంశానికి చెందిన నిజాంను ఉపయోగించుకున్నారు. వాస్తవానికి 1858 తర్వాత నిజాం సార్వభౌమ రాజు కాదు. బ్రిటిష్ వారు నిజాంపై ‘సర్వోన్నత అధికారాన్ని’ సొంతం చేసుకున్నారు.
ఈ విధంగా బ్రిటిష్ రెసిడెంట్ కార్యాలయం ద్వారా నిజాం బ్రిటిష్ పాలనలో భారతదేశంలో భాగంగా ఉన్నారు. ఆ తరువాత ఐసిఎస్ అధికారులు పరిపాలనా పగ్గాలను చేపట్టారు. నిజాం అధికార పునాదులకు అసలైన సవాలు విసిరినవారు తెలంగాణ ప్రజలే. స్వాతంత్ర్యానికి ముందు రోజుల్లో ఆయన మద్దతుదారులైన దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్లు తీవ్రమైన సవాలును ఎదుర్కొన్నారు. తిరుగుబాటు పరిస్థితి కారణంగా, భూమికి అసలైన యజమానులను గుర్తించే విధంగా దివానీ పరిపాలన సంస్కరించడమైనది. అటువంటి సంస్కరణల ఫలితంగా వంశపారంపర్య అధికారాలైన వతన్‌లు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో, పట్టాదారులుగా ఉన్న విశాలమైన భూభాగాల భూస్వాములను దొరలుగా పిలవడం ప్రారంభించారు. ఆ భూస్వాములు గ్రామాలలో తమ అధికారాన్ని స్థాపించుకుని దొరలుగా మారారు. వారు తమ సేవకులను గూండాలుగా మార్చి తమ ప్రభావాన్ని చూపారు. అప్పుడు గ్రామాలు తిరుగుబాటు చేశాయి.
స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్
స్వతంత్రంగా ఉండాలన్న నిజాం ఆశలు అడియాశలయ్యాయి. అప్పటి పరిస్థితుల్లో భారతదేశంతో 'యథాతథ ఒప్పందం' ( స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్)పై సంతకం చేయడం తప్ప నిజాంకు మరో మార్గం లేకపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన కేవలం మూడు నెలల తర్వాత 1947 నవంబర్ 29న ఆయన ఈ ఒప్పందంపై సంతకం చేశారు. నిజాం యథాతథ ఒప్పందంపై సంతకం చేయడంతో హైదరాబాద్ సూత్రప్రాయంగా భారత యూనియన్‌లో భాగమైందని, హైదరాబాద్‌లో యూనియన్ ఏజెంట్ జనరల్‌ను నియమించారని పటేల్ రాజ్యాంగ సభలో ప్రకటించారు. ఈ యథాతథ ఒప్పందం భారతదేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరించడానికి ఒక సంకేతంగా నిలిచింది.
లార్డ్ మౌంట్‌బాటన్ సూచన మేరకు ఆయన ఆ ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ అదే రోజున తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ‘షా మంజిల్’లోని ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఖాసీం రజ్వీ తన అధీనంలోకి తీసుకోవడమే దీనికి ప్రధాన కారణం. సర్దార్ పటేల్‌కు రాసిన ఒక రహస్య లేఖలో భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగితే తాను తటస్థంగా ఉంటానని నిజాం పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్ సైన్యం తన నియంత్రణలోనే ఉండాలని కూడా ఆయన కోరుకున్నారు. 'రాష్ట్రాల వ్యవహారాల మంత్రిత్వశాఖ' నుంచి తీవ్ర హెచ్చరిక వచ్చిన తర్వాత, నిజాం వెంటనే సర్దార్ పటేల్‌కు రాసిన ఆ లేఖను ఉపసంహరించుకున్నారు. నిజాం భారత ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం ప్రారంభించారు.
తెలంగాణలో కొనసాగిన అశాంతి
హైదరాబాద్‌లో జరిగిన హింసాత్మక ఘటనల విషయానికి వస్తే, తాను ఒక ఖైదీనని, ప్రజలను
నియంత్రించడానికి రజ్వీ ‘ఫాసిస్ట్ పద్ధతులను’ ఉపయోగిస్తున్నాడని నిజాం ప్రకటించారు. దీంతో నిజాంను విముక్తి చేయడానికి జోక్యం చేసుకునే అవకాశం భారత ప్రభుత్వానికి ఇక్కడ లభించింది. హైదరాబాద్‌పై సైనిక చర్య చేపట్టడానికి ముందు వివిధ జాతీయ నాయకులు, మంత్రులు, అధికారులు, సైనిక అధికారుల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. రజాకార్ల చర్యలలో నిజాంకు ఉన్న ప్రమేయం గురించి వారికి తెలుసు. రైతాంగ తిరుగుబాటుదారుల నుంచి భూస్వాముల గడీలను రజాకార్లు కాపాడుతూ వచ్చారు.
ప్రజల తిరుగుబాటు నుంచి తప్పించుకోవాలని, అలాగే భూస్వాములు, జాగీర్దారుల భూములను స్వాధీనం చేసుకోవడాన్ని అడ్డుకోవాలని నిజాం భావించారు. హైదరాబాద్ సైన్యంతో ఘర్షణ జరిగే అవకాశం సహా, సైనిక చర్య వల్ల కలిగే రాజకీయ పరిణామాలను అప్పటికే 'యూనియన్ ప్రభుత్వం'గా ఉన్న భారత ప్రభుత్వం క్షుణ్ణంగా అంచనా వేసింది. హైదరాబాద్ పాలనకు ముస్లిం ప్రపంచం నుంచి ఎటువంటి మద్దతు లభించదని యూనియన్ ప్రభుత్వం నిర్ధారించుకుంది.
నెహ్రూ, కమ్యూనిస్టులు
హైదరాబాద్‌లో ఆక్రమణ జరగకూడదనేది నెహ్రూ ఆందోళనగా ఉండేది. నిజాం ‘స్వాతంత్ర్యం’ కోసం ప్రణాళిక రచిస్తున్నాడని భారత ప్రభుత్వానికి ఏజెంట్ జనరల్ కె. ఎం. మున్షీ ద్వారా సమాచారం అందింది. అదే సమయంలో రజాకార్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి కమ్యూనిస్టులు భారత సైన్యానికి వ్యతిరేకంగా నిలబడవచ్చని కూడా నిఘా సమాచారం అందింది. కమ్యూనిస్టులు నెహ్రూ ప్రభుత్వాన్ని సామ్రాజ్యవాదులతో ఒప్పందంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో, జూన్ 1948లో 'ఆపరేషన్ క్యాటర్‌పిల్లర్' అనే పేరుతో ఒక సైనిక చర్యకు ప్రణాళిక రచించారు. కానీ వర్షాకాలం కారణంగా అప్పుడు సైన్యం సిద్ధంగా లేదు.
అప్పుడు భారత ప్రభుత్వం వెస్ట్రన్ కమాండ్‌తో సంప్రదించి, 1948 సెప్టెంబర్ 17న 'ఆపరేషన్ పోలో'ను నిర్వహించాలని ప్రణాళిక వేసింది. సెప్టెంబర్ 13న అసలు దాడి జరిగినప్పుడు హైదరాబాద్ వైపు ఎటువంటి ప్రతిఘటన ఎదురవలేదు. సెప్టెంబర్ 16న సైన్యం సికింద్రాబాద్ చేరుకుంటున్నప్పుడు, నిజాం కె.ఎం. మున్షీతో ‘రాబందులు రాజీనామా చేశాయి. ఏమి చేయాలో నాకు తెలియడం లేదు’ అని తెలియజేశారు. రజాకార్ల ప్రభుత్వం రాజీనామా చేసిందని ఆయన ఉద్దేశం.
16వ తేదీన లైక్ అలీ రాజీనామాను మున్షీకి అందజేశారు. హైదరాబాద్ ప్రభుత్వాన్ని నియమించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మున్షీ సూచించారు. దీంతో ఇకపై ప్రభుత్వాన్ని నియమించే అధికారాన్ని తాను పూర్తిగా కోల్పోయానని నిజాం గ్రహించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చేవరకు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన నిజాం బిరుదుతోనే కొనసాగారు. ఆ తర్వాత మతతత్వ ముస్లింలను రాజ్యాంగ పరిధిలోకి మరింతగా తీసుకురావడానికి, రాజ్యాంగ సభలో రాజప్రముఖ్ పదవిని సృష్టించి, 1949లో దానిని రాజ్యాంగబద్ధమైన పదవిగా చేశారు.
ఒక ప్రాదేశిక దేశంగా భారతదేశం ఆవిర్భావం
సర్వోన్నత అధికారాన్ని చెలాయిస్తున్న బ్రిటిష్ పాలిత ప్రెసిడెన్సీలను, రాచరిక రాష్ట్రాలను ఏకీకృతం చేయడం ద్వారా ప్రాదేశిక దేశాన్ని నిర్ధారించడం కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. గవర్నర్- జనరల్ కింద ప్రత్యక్షంగా పాలించే భూభాగాలను, క్రౌన్ ప్రతినిధి కింద పరోక్షంగా పాలించే భూభాగాలను ఒకే పాలన కిందకు, అంటే భారత యూనియన్ కిందకు తీసుకురావాల్సి ఉంది. రాచరిక రాష్ట్రాలను జయించి ప్రాదేశిక దేశాన్ని రూపొందించడం యూనియన్‌కు ఒక పెద్ద సవాలుగా ఉండేది.
ముఖ్యంగా మొఘల్ పాలన వారసత్వంతో రాజులు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు వంటి వివిధ మధ్యయుగ అధికార నిర్మాణాలతో హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉంది. అటువంటి శక్తులను 'ప్రాదేశిక భారతదేశం' ప్రాజెక్టు కిందకు తీసుకురావడానికి నిజాంను లొంగదీసుకోవలసి వచ్చింది. పాకిస్థాన్‌లో చేరాలన్న జిన్నా ప్రతిపాదనను నిజాం తిరస్కరించిన తర్వాత నెహ్రూ ఆయనతో శత్రుత్వాన్ని ఎన్నడూ కోరుకోలేదు. ఈ పరిస్థితులలో నిజాం ఢిల్లీలోని స్వతంత్ర భారత ప్రభుత్వంతో రాజీపడవలసి వచ్చింది.
ఎట్టకేలకు 1724లో భూస్వామ్య వ్యవస్థ పునాదులపై నిర్మితమైన నిజాం పాలన 223 సంవత్సరాల తర్వాత ప్రస్తుత రూపంలోకి రూపాంతరం చెందింది. చరిత్రకారులకు బ్రిటిష్ వారి నుంచి వచ్చిన స్వాతంత్ర్యం మాత్రమే తెలుసు. అంటే1947 భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల మాదిరిగానే హైదరాబాద్ కూడా స్వాతంత్ర్యం పొందింది, కానీ విలీనం అయ్యేవరకు అధికారికంగా పాలన కొనసాగింది. మిగిలినదంతా ప్రాదేశిక దేశాన్ని పటిష్టం చేయడానికి జరిగిన విలీన ప్రక్రియగా భావించాలి.
-ఇనుకొండ తిరుమలి చరిత్రకారుడు,
రిటైర్డ్ ప్రొఫెసర్, ఢిల్లీ యూనివర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు
పంపాల్సిన మెయిల్ ఐడీ [email protected]
రచన 700 పదాలకు మించరాదు.
